XtGem Forum catalog
Teluguworld.wap.sh









విడుదల తేదీ : 28 నవంబర్ 2014
TeluguArea.com : 2.5/5
దర్శకుడు : సి. హెచ్ సుబ్బారెడ్డి
నిర్మాత : అభిలాష్ మాధవరం
సంగీతం : మణిశర్మ
నటీనటులు : ఆది, రకుల్ ప్రీత్ సింగ్…

‘గాలిపటం’ లాంటి ఓ బోల్డ్ సినిమా తర్వాత యంగ్ హీరో ఆది నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రఫ్’. ఆది సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా సుబ్బారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మొదటిసారి మణిశర్మ ఆది సినిమాకి సంగీతం అందించాడు. ఆది ఈ సినిమా కోసం స్పెషల్ గా సిక్స్ ప్యాక్ కూడా చేసాడు. మరి గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఆది ట్రై చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించింది.? అలాగే ఆది సిక్స్ ప్యాక్ ఈ సినిమాకి హెల్ప్ అయ్యిందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :
చందు (ఆది) ఎవరూ లేని ఓ అనాధ.. అనాధ అయిన చందుకి ప్రేమపైన ఎంతో నమ్మకం ఉంటుంది. ప్రేమంటే కడుపు చేసి మోసం చెయ్యడం కాదు పెళ్లి చేసుకొని కలకాలం జీవించడమే అనే విషయాన్ని చందు గట్టిగా నమ్ముతాడు. అలాంటి చందు ఓ రోజు తనలాంటి ఆలోచనలే ఉన్న నందిని(రకుల్ ప్రీత్ సింగ్)ని చూసి ప్రేమలో పడతాడు. అలా నందినిని ప్రేమించడం మొదలు పెట్టిన చందు తన ప్రేమ గురించి ముందు నందిని కంటే, తన అన్నయ్య అయిన సిద్దార్థ్(శ్రీ హరి)కి ముందు చెప్పి ఒప్పించాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే వెళ్లి చెబుతాడు..

కానీ సొసైటీలో మంచి పరపతి ఉన్న బిగ్గెస్ట్ బిజినెస్ మాన్ అయిన సిద్దార్థ్ ఇది నచ్చకపోవడంతో తన చెల్లి నందిని చందు ప్రేమలో పడకూడదని పలు ప్రయత్నాలు చేస్తాడు. సిద్దార్థ్ వేసే ప్లాన్ నుంచి తప్పించుకుంటూ ఆది ఎలా నందినిని ప్రేమలో పడేసాడు.? చివరికి సిద్దార్థ్ చందు – నందినిల ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.?లేదా.? అలాగే అనాధ ని చెప్పుకున్న చందు నిజంగా అనాధేనా? లేక వేరే ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అనేది మీరు వెండి తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సి వస్తే ముందుగా పరవాలేదు అనిపించేలా చేసిన నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలి.. ముందుగా స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి గురించి చెప్పాలి. శ్రీ హరి ఉన్నంత సేపూ తన పాత్రకి న్యాయం చేసాడు. అలాగే శ్రీ హరి పాత్రకి చెప్పినతని డబ్బింగ్ కూడా బాగా సెట్ అయ్యింది. ఇప్పటి వరకూ లవర్ బాయ్ ఇమేజ్ లో చాలా క్లాస్ గా కనిపించిన ఆది ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తాడు. ఈ సినిమా కోసం తను చేసిన సిక్స్ ప్యాక్ లుక్ క్లైమాక్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఆది చేసిన డాన్సులు, స్టంట్స్ కూడా బాగున్నాయి.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేసిన మొదటి సినిమా ఇది, కానీ తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాక ఇది రిలీజ్ అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని సీన్స్ లో చూడటానికి బాగుంది. అలాగే పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించి మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక పోతే సినిమాలో వచ్చే ఇంటర్వల్ ఎపిసోడ్ బాగుంటుంది. అలాగే శ్రీ హరి – ఆది కాంబినేషన్ లో వచ్చే సీన్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఆది కాస్త రిస్క్ చేసి చేసిన యాక్షన్ ఎపిసోడ్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి.. ముందుగా ఏ సినిమాకి అయినా బలం కథే.. కానీ ఈ సినిమాకి కథే మైనస్.. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కానీ ఆ పాయింట్ మొదటి 5 నిమిషాల్లోనే చెప్పేసి ఆ తర్వాత నుంచి కాన్సెప్ట్ ని పక్కన పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఎలా పడితే అలా వెళ్ళిపోయాడు. దాంతో అనుకున్న కథ ఒకటి అయితే, తీసిన సినిమా వేరొకటి అయ్యింది. సరే కథ పోయినా కథనం పైన అయినా శ్రద్ధ పెట్టాల్సింది. కానీ అది కూడా సరిగా లేకపోవడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. కనీసం రాసుకున్న ట్విస్ట్ లను అయినా ఆడియన్స్ షాక్ అయ్యేలా, చూస్తున్న ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేలా రివీల్ చెయ్యాలి కానీ అది కూడా చేయలేదు.

ఈ మూవీ డైరెక్టర్ అటు నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవాలి, అలాగే అన్ని కమర్షియల్ అంశాలను కథకి జత చేయాలని అనుకున్నాడు. కానీ మొదటి సినిమా కావడం, కాస్త తడబడడం వలన ఆ రెండు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో చాలా ఎమోషనల్ మరియి సెంటి మెంట్ సీన్స్ ఉన్నాయి కానీ ఒక్క సీన్ ని కూడా సరిగా రాబట్టుకోలేదు. అలాగే ఈ మధ్య ఆడియన్స్ కథ పాతదే అయినా కామెడీ ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఈ సినిమాలో కామెడీ కూడా లేకపోవడం వలన సెకండాఫ్ లో చాలా మంది ఆడియన్స్ వాకౌట్ చేసారు.

ఫస్ట్ హాఫ్ మొదలవ్వడం పరవాలేధనిపించినా ఆ తర్వాత డల్ గా తయారవుతుంది. ఇంటర్వల్ తర్వాత ఆడియన్స్ సెకండాఫ్ బాగుంటుందేమో అనుకుంటారు కానీ సెకండాఫ్ కొంత చూసాక దానికన్నా ఫస్ట్ హాఫ్ బెటర్ కదా అని అనుకుంటారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. సెకండాఫ్ ఏ రేంజ్ లో ఉందో.. తెలుగు సినిమా అంటే 6 పాటలు ఉండాలి అనే ఫార్మాట్ ని ఈ మూవీ డైరెక్టర్ తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు. కానీ సినిమాలోని ఒకటి రెండు పాటలు తప్పితే మిగతా న్ని పాటలు సినిమా నిడివిని పెంచి ప్రేక్షకులకు బోర్ కోట్టించాయే తప్ప సినిమాకు అస్సలు హెల్ప్ అవ్వలేదు. ఇది మాస్ సినిమా అయినా మాస్ ఆడియన్స్ కోరుకునేవి ఏవీ ఇందులో లేవు.

సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి టెక్నికల్ పరంగా సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ ఎవ్వరూ అంతగా హెల్ప్ అవ్వలేదనే చెప్పాలి.. సెంథిల్ కుమార్ – అరుణ కుమార్ కలిసి చేసిన సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. సినిమా చాలా రోజులు ఆలస్యం కావడం వల్ల బ్లూ మాట్ వాడి తీసిన సీన్స్ అస్సలు బాలేవు. అలాగే సిజి వర్క్ కూడా చాలా నాశిరకంగా ఉంది. మణిశర్మ అందించిన పాటలు సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. అలాగే ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి అస్సలు సెట్ అవ్వలేదు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సినిమాలో చాలా సీన్స్ మరియు ఒక రెండు మూడు సాంగ్స్ అన్నా లేపేసి ఉంటే సినిమా రన్ టైం తగ్గి ఆడియన్స్ కి కాస్త ఊరట కలిగి ఉండేది.

సీనియర్ రైటర్ మరుధూరి రాజ డైలాగ్స్ అంటే బాగుంటాయి అనే ఓ భావన ఉంది, కానీ ఆయన ఈ సినిమాతో ఆ పేరుని పోగొట్టుకుంటాడు. దానికి కారణం ఈ మధ్య వస్తున్న పంచ్ డైలాగ్స్ ప్రభావం ఈయన మీద పడటం. డైరెక్టర్ సుబ్బారెడ్డి పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ కావాలని అడిగినట్టున్నాడు, దాంతో రాజా సీన్ కి సంబంధం లేకుండా జస్ట్ రైమింగ్ మాత్రమే చూసుకొని డైలాగ్స్ రాసేశాడు. ఇక డైరెక్టర్ సుబ్బారెడ్డి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసాడు. కథ – కొత్తదేమీ కాదు, చాలా సినిమాలను కలిపి రాస్తే ఈ కథ వస్తుంది. స్క్రీన్ ప్లే – ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. దర్శకత్వం – కెప్టెన్ అఫ్ ది మూవీ డైరెక్టర్, అంటే అన్ని విషయాల పైన ముఖ్యంగా స్క్రిప్ట్, తీయాలనుకున్న దానిమీద చాలా క్లారిటీ ఉండాలి. సినిమా చూసిన వారు ఆ క్లారిటీ సుబ్బారెడ్డిలో లేదని ఫీలవుతారు. మొదటి సినిమా కావడం వల్ల చాలా తడబడ్డాడని తెలుస్తుంది. కమర్షియల్ అంశాలు, సిక్స్ ప్యాక్ ఇలాంటి వాటికంటే కథ బాగుంటేనే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే విషయాన్ని సుబ్బారెడ్డి మిస్ అయినట్టున్నాడు. నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

తీర్పు :

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారాలనే ఉద్దేశంతో ఆది ట్రై చేసిన ‘రఫ్’ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆది మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టే సత్తా ఈ సినిమా కంటెంట్ లో లేకపోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. డైరెక్టర్ ఒరిజినల్ కథ – స్క్రీన్ ప్లే మీదకంటే కమర్షియల్ పాయింట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు, కానీ కంటెంట్ లేని సినిమాకి ఎన్ని కమర్షియల్ అంశాలు జోడించినా ప్రేక్షకులను మెప్పించలేమనే చిన్న లాజిక్ ని డైరెక్టర్ మిస్ అయ్యాడు, సో డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. ఆది మాస్ లుక్, రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, శ్రీహరి అప్పియరెన్స్ ఈ సినిమాకి ప్లస్ అయితే ఆడియన్స్ ని నిరాశాపరిచేలా సినిమా ఉండడం మైనస్ పాయింట్. ఫైనల్ గా ‘రఫ్’ సినిమా ఆడియన్స్ ని రఫ్ఫాడించి ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది..





TeluguWorld.wap.sh:-2.5/5




Users Online


1085